Gold Rates | బంగారం ధర ధగధగ మెరుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం దేశ రాజధానిలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.600 పెరిగి రూ.76,950లకు చేరుకున్నది. గత శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.76,350 పలికింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.76,000 నుంచి రూ.76,600లకు పెరిగింది. మరోవైపు, వారం రోజులుగా పెరుగుతున్న వెండి ధరకు సోమవారం బ్రేక్ పడింది. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.90 వేలకు పరిమితమైంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.91 వేలు పలికింది.
ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం అక్టోబరల్ డెలివరీ ధర రూ.184 పెరిగి రూ.74,224లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.1035 పతనమై రూ.89,100లకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 0.04 శాతం పెరిగి 2647.30 డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఔన్స్ వెండి ధర 30.96 డాలర్లకు పరిమితమైంది.