Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులు ఉన్నా దేశీయంగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. జ్యువెల్లర్ల నుంచి తాజా డిమాండ్ పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.600 వృద్ధి చెంది రూ.74,100లకు చేరుకున్నది. సోమవారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.73,500 పలికింది.
మరోవైపు మంగళవారం కిలో వెండి ధర సైతం రూ.700 వృద్ధితో 84,500లకు చేరింది. 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.400 పెరిగి రూ.73,750 వద్ద స్థిర పడింది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2532.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఇన్వెస్టర్లు అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి సారించారని ఆనంద్ రాథీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ ఏవీపీ మనీశ్ శర్మ తెలిపారు. ఇక ఔన్స్ వెండి ధర 28.70 డాలర్లు పలికింది.