Gold- Sirver Rates | అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గత నెల 23న కేంద్ర బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా వాటి ధరలు కాస్త ఉపశమించాయి. కానీ దేశీయంగా గిరాకి పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1400 పెరిగి రూ.74,150లకు చేరుకున్నది. శుక్రవారం 24 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.72,750 వద్ద స్థిర పడింది. మరోవైపు మంగళవారం కిలో వెండి ధర రూ.3,150 వృద్ధి చెంది రూ.87,150 వద్ద స్థిర పడింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.84 వేల వద్ద ముగిసింది.
గత నెల 23న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారం, వెండి తదితర లోహాలపై దిగుమతి సుంకం భారీగా తగ్గించారు. దీంతో గత నెల 23న తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.3,350 పతనమై రూ.72,300లకు పడిపోయింది. తాజాగా మంగళవారం 99.9 స్వచ్ఛత బంగారం తులం ధర రూ.1400 పుంజుకుని రూ.74,150, 99.5 స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.1400 వృద్ధితో రూ.73,800 వద్ద నిలిచింది.
అంతర్జాతీయంగానూ డిమాండ్ పెరగడంతోపాటు దేశంలోనూ బంగారం, వెండి ఆభరణాలకు గిరాకీ పెరగడం వల్లే వాటి ధరలు వృద్ధి చెందాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఔన్స్ 18.80 డాలర్లు వృద్ధి చెంది రూ.2,549.90 డాలర్లు పలికింది. వచ్చే నెలలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల తగ్గింపుపై దూకుడుగా ముందుకెళ్తుందన్న అంచనాల మధ్య ఇన్వెస్టర్లు బంగారంపై మోజు పెంచుకున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.
యూఎస్ లో మాంద్యం భయాలు పొంచి ఉన్నాయని చికాగో ఫెడ్ ప్రెసిడెంట్ పేర్కొనడంతోపాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనంగా అమెరికా డాలర్ ట్రేడింగ్ వంటి కారణాలతో బంగారం ధర పెరుగుతున్నదని కోటక్ రీసెర్చ్ ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కయ్నాత్ చైన్ వాలా తెలిపారు. పాలసీ నిర్ణేతలు ఆచితూచి స్పందిస్తున్న నేపథ్యంలో త్వరలో జరిగే యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయంపైనే ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 30.19 డాలర్లు పలుకుతోంది.