Gold Price | న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చేరిన విషయం తెలిసిందే. తులం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు గరిష్ఠంగా రూ.82,400 పలికింది. అయితే అక్టోబర్ ఆఖరుదాకా పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు.. గత నెలన్నర (45 రోజులు)గా పడుతూ.. లేస్తూ.. సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూజీసీ తాజా అంచనాలు సైతం ప్రస్తుత మార్కెట్ తీరుకు అనుగుణంగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలోనూ మార్కెట్ ట్రెండ్ ఇదే రీతిలో ఉండవచ్చన్న అభిప్రాయాన్ని 2025 ఔట్లుక్లో వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 30 శాతానికిపైగా పుంజుకున్నాయి. సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బంగారం కొనుగోళ్లకు పెద్దపీట వేసింది. ఆర్బీఐ సైతం గోల్డ్ రిజర్వులకు అత్యంత ప్రాధాన్యాన్నిస్తున్న సంగతి విదితమే. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ పోరు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానం వంటివి స్టాక్ మార్కెట్లను కుంగదీశాయి. ఫలితంగా మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం ప్రత్యామ్నాయ మార్గమైన పసిడి వైపు చూశారు. దీంతో ఈ ఏడాది గోల్డ్ మార్కెట్లో డిమాండ్ ఊహించనివిధంగా పెరిగిపోయింది. ఇది ధరలను పరుగులు పెట్టించింది. మరోవైపు పండుగ సీజన్లు, పెండ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు కూడా కలిసొచ్చాయి.
బంగారం ధరలు వచ్చే ఏడాది ఈ స్థాయిలో పెరగకపోవచ్చని డబ్ల్యూజీసీ తాజాగా పేర్కొన్నది. జీడీపీ వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు గోల్డ్ మార్కెట్ క్రయవిక్రయాలను ప్రభావితం చేయవచ్చని అంటున్నది. జనవరిలో అమెరికాకు రాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వాణిజ్య యుద్ధాలకు తెర లేపవచ్చన్న ఆందోళనల్ని కనబర్చింది మరి. పరస్పర సుంకాలతో మదుపరులు, కొనుగోలుదారులు మార్కెట్కు దూరం కావచ్చని, దీంతో ఆయా దేశాల జీడీపీ, విపణిలో డిమాండ్ పడిపోవచ్చని హెచ్చరించడం గమనార్హం. కానీ ఇప్పటికైతే బంగారం ధరలు అంతర్జాతీయంగా గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. ఔన్స్ 2,700 డాలర్ల సమీపంలో ఉన్నది. ఇక గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ వచ్చే ఏడాది ఆఖర్లో 3,000 డాలర్లకు పోవచ్చంటున్నది. యూబీఎస్ ఏజీ అంచనా 2,900 డాలర్లుగా ఉన్నది.
బంగారం ధరలు శనివారం మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.980 దిగి రూ.77,890గా నమోదైంది. 22 క్యారెట్ రూ.900 పడిపోయి రూ.71,400 పలికింది. మార్కెట్లో డిమాండ్ పడిపోవడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. కాగా, శుక్రవారం కూడా ధరలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఒక్కరోజే 24 క్యారెట్ తులం రూ.1,400 క్షీణించింది. ఇక వెండి కిలో ధర ఏకంగా రూ.4,200 పతనమై రూ.92,800 వద్దకు పరిమితమైంది. ఈ ఏడాది కిలో ధర లక్షా 2 వేల రూపాయల ఆల్టైమ్ హైని తాకినది తెలిసిందే.