న్యూఢిల్లీ, అక్టోబర్ 31: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. స్టాకిస్టులు, ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.2.200 ఎగబాకి రూ.1,25,600కి చేరుకున్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర అంతే స్థాయిలో ఎగబాకి రూ.1,25,000గా నమోదైంది.
రూపాయి పతనంతో పసిడి ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్ఈసీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అయినప్పటికీ వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి రూ.2,000 దిగొచ్చి రూ.1,53,000గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,000 డాలర్ల పైకి చేరుకోగా, వెండి 48.97 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. మరోవైపు, ఫ్యూచర్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పటాయి. పదిగ్రాముల గోల్డ్ ధర రూ.218 తగ్గి రూ.1,21,290కి దిగొచ్చింది.