Gold Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బంగారం ధర భగభగమండుతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాలు మంగళవారం మరో మైలురాయికి చేరుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర మరో రూ.350 ఎగబాకి రూ.81 వేలకు చేరుకున్నది. అలాగే కిలో వెండి ఏకంగా రూ.1,500 అధికమై లక్ష రూపాయలు పలికింది. దేశీయంగా పండుగ సీజన్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీ జరగడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఇల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. రికార్డు స్థాయికి ధరలు చేరుకోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని బులియన్ వర్తకులు హెచ్చరిస్తున్నారు.