న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రోజుకొక ఆల్‌టైం హైకీ చేరుకుంటున్న ధరలు బుధవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్ కలిగిన పది గ్రాముల పుత్తడి ధర రూ.69,200 పలికింది.
మంగళవారం ముగింపుతో పోలిస్తే రూ.830 ఎగబాకినట్లు అయింది. ప్రస్తుత వారంలోనే రికార్డు స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ఏకంగా రూ.1,700 అధికమై రూ.80 వేలు అధిగమించి రూ.80,700 వద్ద ముగిసింది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.760 అధికమై రూ.69,870కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.750 పెరిగి రూ.64,100 స్థిరపడింది. అలాగే వెండి రూ.2 వేలు పెరిగి రూ.84 వేలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర 2,275 డాలర్లకు చేరుకోగా, వెండి 26.25 డాలర్ల వద్ద ఉన్నది.