న్యూఢిల్లీ, మార్చి 5: బంగారం ధరలు రివ్వున దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే స్పాట్ మార్కెట్లో సరికొత్త రికార్డు స్థాయిని చేరా యి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ తులం రేటు ఏకంగా రూ.800 ఎగబాకింది. దీంతో 10 గ్రాముల పుత్తడి విలువ దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.65,000లుగా నమోదైంది. సోమవారం ఇది రూ.64,200లుగానే ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్టు తాజా ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూన్‌లో వడ్డీరేట్లను తగ్గించబోతున్నదన్న ఊహాగానాలు పెరిగాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు రోజుల్లో ఎంసీఎక్స్‌లో రేట్లు రూ.2,400లకుపైగా పెరిగాయంటున్నారు.
హైదరాబాద్‌లోనూ పసిడి ధరలు పరుగులు పెట్టాయి. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.760 ఎగిసి రూ.64,850గా ఉన్నది. 22 క్యారెట్ రూ.700 పెరిగి రూ.59,450కి చేరింది. నిజానికి గతకొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూపోతున్నాయి. ఈ నెల 2న కూడా తులం ధర రూ.930 పుంజుకున్నది. అంతకుముందు రోజు రూ.330 పెరుగగా, వారం రోజుల్లో 24 క్యారెట్ రేటు రూ.2,020 ఎగిసింది. 22 క్యారెట్ కూడా రూ.1,860 ఎగబాకింది.
వెండి ధరలూ పుంజుకున్నాయి. ఢిల్లీలో కిలో ధర రూ.900 ఎగిసి రూ.74,900లను తాకింది. ఇక హైదరాబాద్‌లోనైతే రూ.1,200 ఎగబాకి రూ.78,200లకు చేరింది. సాధారణ వినియోగదారులతోపాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి పెరిగిన డిమాండ్ కలిసొచ్చినట్టు ట్రేడర్లు చెప్తున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ 2,110 డాలర్లుగా ఉన్నది. గత ముగింపుతో చూస్తే 1 శాతం పెరిగింది. వెండి ఔన్సు 23.88 డాలర్లు పలికింది. అంతకుముందు 23.09 డాలర్లుగా ఉన్నది. ‘అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, ఈక్విటీలు స్థిరంగా సాగుతున్నా.. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడుల దిశగా కదులుతున్నారు’ అని జేఎం ఫైనాన్షియల్ ఉపాధ్యక్షుడు ప్రణవ్ మేర్ అంటున్నారు.
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా కొత్త రికార్డు స్థాయికి చేరాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా రూ.65,000లు పలికింది. ఈ ఒక్కరోజే రూ.800 పెరిగింది.
-సౌమిల్ గాంధీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ విశ్లేషకులు
అమెరికాలో పారిశ్రామిక మందగమనం సంకేతాలు, నెమ్మదించిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
-జతిన్ త్రివేది, ఎల్కేపీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్