Gold Rates | బంగారం అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం.. అందునా భారతీయ మహిళలు ప్రాణం పెడతారు. ప్రతి పండక్కీ, శుభ కార్యానికి, కుటుంబ వేడుకలకు అవకాశం ఉంటే బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. వెసులుబాటు లేకుంటే ఉన్న బంగారు ఆభరణాలే ధరిస్తారు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో బంగారం పెట్టుబడికి ఆల్టర్నేటివ్ మార్గంగా కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమలు చేసే దిగుమతి సుంకాలు, ఇతర టారిఫ్‌లపై ఇంకా మబ్బు తెరలు వీడలేదు. ట్రంప్ విధానాల్లో స్పష్టత వచ్చే వరకూ బంగారం ధరలు ధగధగ మెరుస్తూనే ఉంటాయి. గురువారం వరుసగా రెండో రోజు దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.50 వృద్ధితో రూ.83,800లతో మరో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బుధవారం తులం (99.9శాతం స్వచ్ఛత) ధర రూ.83,750 వద్ద స్థిర పడింది.
గురువారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.50 పెరిగి జీవిత కాల గరిష్ట స్థాయి రూ.83,400 వద్ద ముగిసింది. బుధవారం ఇదే బంగారం తులం (99.5 శాతం) ధర రూ.83,350 వద్ద ముగిసింది. గురువారం కిలో వెండి ధర రూ.1,150 వృద్ధితో రూ.94,150 పలికింది. బుధవారం ఇదే కిలో వెండి ధర రూ.93,000 వద్ద నిలిచింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ. 575 (0.72 శాతం) వృద్ధితో రూ.80,855 మరో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఏప్రిల్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.541 (0.67 శాతం) పెరిగి రూ.81,415 వరకూ ట్రేడయింది. కామెక్స్ గోల్డ్‌లో బంగారం ధర గత వారం రోజులుగా 2.5శాతం పెరిగింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.1,050 (1.14 శాతం) పెరిగి రూ.92,916లకు చేరుకుంది. గురువారం ఇదే కిలో వెండి ధర రూ.91,866 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్‌లో ఔన్స్ బంగారం ధర 23.65 డాలర్లు (0.84 శాతం) వృద్ధితో 2,817.15 డాలర్లకు చేరుకుని జీవిత కాల గరిష్టాన్ని తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే విధాన నిర్ణయాలపై అనిశ్చితి కొనసాగుతుండటంతో యూఎస్ ట్రెజరీ బాండ్లు పతనం అయ్యాయి. ఫలితంగా బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. కామెక్స్ సిల్వర్‌లో ఔన్స్ వెండి ధర 2.06 శాతం వృద్ధి చెంది 32.04 డాలర్లకు చేరుకుంది.