న్యూఢిల్లీ, జూలై 20: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే క్రమంలో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,400 ఎగబాకి రూ.1,46, 900కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1,45,500గా ఉన్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
బంగారం ధరలు బలపడ్డప్పటికీ, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.2,21,500గా నమోదైంది. వరుసగా ఆరు రోజులుగా వెండి ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ నెల 10 నుంచి కిలో వెండి ఏకంగా రూ.15,500 లేదా 6.5 శాతం తగ్గినట్టు అయింది. ఫెడ్ నిర్ణయం, మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడం వల్లనే ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,020 డాలర్లు పలుకగా, వెండి 56.88 డాలర్ల వద్ద ఉన్నది.