Gold Price | న్యూఢిల్లీ, మార్చి 10: ఈ ఏడాదీ మదుపరులకు హాట్ ఫేవరేట్ బంగారమే. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు.. తమకు వాటిల్లే నష్టాల నుంచి రక్షణగా పుత్తడినే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గడిచిన 12 నెలల్లో పసిడి ధర 40 శాతానికిపైగా ఎగబాకింది. అయితే ఇదొక్కటే గోల్డ్ రేట్లను పరుగులు పెట్టిస్తున్న కారణమా? అంటే కాదనే చెప్పాల్సి వస్తున్నది. ఈ గోల్డ్ రన్ వెనుక ఒక్క కారణమే ఉందంటే ఎంతమాత్రం సరికాదు మరి. అయితే ఇంకేంటి? బంగారం ధరలు రికార్డుల్లో పరుగులు పెట్టడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే..
జూన్ 2022లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం గరిష్ఠాన్ని తాకింది. నిజానికి ఆ ఏడాది మార్చి నుంచే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. ధరల అదుపునకు వడ్డీరేట్లను పెంచ డం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఫలితం శూన్యం. దీంతో జూలై 2023దాకా రేట్లను ఫెడ్ రిజర్వ్ పెంచుతూనే పోయింది. ఆ తర్వాత కూడా సెప్టెంబర్ 2024 వరకు వడ్డీరేట్లను తగ్గించకుండా గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచింది. భారత్‌లోనూ ఆర్బీఐ ఇదే రకమైన ద్రవ్య విధానాన్ని అవలంభించిన విషయం తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లు డాలర్ కంటే గోల్డ్ సురక్షితమని భావించి పెద్ద ఎత్తున కొనడం మొదలు పెట్టారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరి 2024 నుంచి పసిడి ధరలు పెరగడం మొదలైంది. కానీ గతకొద్ది నెలలుగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నది. ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. అయితే ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉండటంతో చివరి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ పరిణామం గ్లోబల్ మార్కెట్లో ధరలను అధిక స్థాయిల వద్దే ఉంచేలా చేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొని నిల్వ చేసుకుంటున్నాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇవి చక్కగా ఉపయోగపడుతాయని రిజర్వ్ బ్యాంకులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలోనే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు డిమాండ్ మరింత పెరుగుతున్నది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు, ఆ తర్వాత చైనా-తైవాన్ మధ్య సంఘర్షణలు తలెత్తినప్పుడు, ఇజ్రాయెల్-హమాస్ దాడులు జరిగినప్పుడు పసిడి కొనుగోళ్లను సెంట్రల్ బ్యాంకులు పెంచుతూపోయాయి. భారత్, చైనా ఈ విషయంలో ముందుంటున్నాయి.
సెంట్రల్ బ్యాంకులు కేవలం బంగారాన్ని కొనడమే కాదు.. ఇన్నాళ్లూ విదేశాల్లో దాచిపెట్టిన పసిడి నిల్వలను తమ దేశంలోకి తీసుకొచ్చుకుంటున్నాయి. భారత్, అమెరికాసహా పలు దేశాల రిజర్వ్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్‌ల్లో బంగారాన్ని దాచిపెడుతున్నాయి. అయితే గత ఏడాది నుంచి ఈ పుత్తడి నిల్వలను తమతమ దేశాల్లోకి అంతా తీసుకెళ్తున్నారు. తమ సొంత వాల్ట్‌ల్లో భద్రపర్చుకుంటున్నాయి. దీనికి అసలు కారణం తెలియకపోయినా.. ట్రంప్ టారిఫ్‌లు లేదా ఇతర సుంకాల నేపథ్యంలో ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రష్యన్ ఫారిన్ ఎక్సేంజ్ హోల్డింగ్స్‌ల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, దాని మిత్ర దేశాలు బ్లాక్ చేశాయి. దీంతో మన సొమ్ము మన దగ్గరే ఉంటే ఉత్తమమన్న ఆలోచనకు అన్ని దేశాలూ వస్తున్నాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత న్యూయార్క్ కొమెక్స్ ఎక్సేంజ్‌కు గోల్డ్ షిప్‌మెంట్స్ దాదాపు 75 శాతం పెరగడం గమనార్హం. బ్రిటన్ వాల్ట్‌ల్లో నుంచి బంగారాన్ని వెనక్కి తీసుకుంటుండటంతో భౌతిక బంగారానికి అక్కడ డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతున్నది. గ్లోబల్ మార్కెట్లో ధరల పెరుగుదలకూ ఇది కూడా కారణమే.
బహిరంగ మార్కెట్ల నుంచి పుత్తడికి డిమాండ్ పెరుగుతుండటం కూడా ధరలను ఎగదోస్తున్నది. జ్యుయెల్లర్స్, ఇండస్ట్రీ, ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకులు, రిటైల్ కస్టమర్ల నుంచి బంగారానికి ఆదరణ పెరుగుతూపోతున్నది. గత ఏడాది రికార్డు స్థాయిలో 4,974 టన్నుల గోల్డ్ డిమాండ్ నమోదైంది. దీని విలువ మునుపెన్నడూ లేనివిధంగా 382 బిలియన్ డాలర్లను తాకింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతీకార సుంకాలకు దిగుతుండటంతో ట్రేడ్‌వార్ భయాలు చుట్టుముడుతున్నాయి. మెక్సి కో, కెనడాలతోపాటు చైనా, భారత్ మరికొన్ని దేశాలపై పెద్ద ఎత్తున సుంకాలను పెంచుతామని హెచ్చరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే కొన్ని దేశాలపై అమలు చేస్తుండగా, మరికొన్నింటిపై వచ్చే నెల నుంచి మొదలు కానున్నాయి. ఇది స్టాక్ మార్కెట్లను కూలదోస్తున్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపునకు మళ్లిస్తున్నారు. ఇదొక్కసారిగా డిమాండ్‌ను పెంచుతున్నది. గత ఏడాది భారతీయ మార్కెట్లో తొలిసారి తులం 24 క్యారెట్ బంగారం గరిష్ఠంగా రూ.89,450 పలికిన సంగతి విదితమే. గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్స్ 2,950 డాలర్ల దరిదాపుల్లోకి వెళ్లింది.