Gold Rate | న్యూఢిల్లీ, మే 26: బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. ఆభరణాల వర్తకులు, రిటైలర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల పుత్తడి ధర మళ్లీ రూ.99 వేల పైకి చేరుకున్నది. గత శనివారంతో పోలిస్తే పుత్తడి ధర రూ.550 ఎగబాకి రూ.99,300 పలికింది. గడిచిన వారంలో బంగారం ధర రూ.3 వేలకు పైగా పెరిగినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.500 అధికమై రూ.98,800 పలికింది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పరుగులు పెట్టాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,170 ఎగబాకి రూ.1,00,370 పలికింది. అంతకుముందు ఇది రూ.99,200గా ఉన్నది. ఈయూ దేశాలపై విధించిన 50 శాతం టారిఫ్లను వాయిదావేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా పెరిగిందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 24.83 డాలర్లు తగ్గి 3,332.59 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
బంగారం బుసలుకొడుతున్నది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలున్నాయని నివేదికలో వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పకాలంలో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ‘గోల్డ్ వీ ట్రస్ట్ రిపోర్ట్ 2025’ పేరుతో విడుదలైన నివేదిక వెల్లడించింది. ఇదే క్రమంలో వచ్చే ఐదేండ్లలో ఔన్స్ ధర 8,900 డాలర్లకు చేరుకోనున్నదని పేర్కొంది. మన కరెన్సీలో ఇంచుమించు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు ఉండనున్నది. అప్పటి డాలర్-రుపీ కరెన్సీల ఆధారంగా ధరలు నిర్ణయించబడుతాయి.