Gold Price | హైదరాబాద్, ఏప్రిల్ 5: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో తులం పసిడి రేటు ఏకంగా రూ.1,030 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (మేలిమి) పుత్తడి విలువ రూ.61,360ని తాకింది. 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ (ఆభరణాల బంగారం) కూడా రూ.950 ఎగిసి ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ రూ.56,250ని చేరింది. మంగళవారం సైతం తులం 24 క్యారెట్ బంగారం ధర రూ.660, 22 క్యారెట్ రూ.600 పుంజుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ మార్కెట్లలోనూ స్పాట్ గోల్డ్ రేట్లు దౌడు తీశాయి. రూ.1,025 పెరిగి లైఫ్‌టైమ్ హై రూ.61,080కి 24 క్యారెట్ గోల్డ్ ధర చేరింది. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.61,000 మార్కును అధిగమించడం ఇదే తొలిసారి అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. అయితే పెండ్లిళ్ల సీజన్‌కు ముందు పుత్తడి ధరలు ఈ స్థాయిలో పెరుగుతుండటం.. అటు కొనుగోలుదారుల్లో, ఇటు వ్యాపారుల్లో ఒకింత ఆందోళనకు దారితీస్తున్నది. ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు స్థిరత్వం లోపిస్తే ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందని నగల వర్తకులు చెప్తున్నారు. కస్టమర్లు సైతం అత్యవసరమైతే తప్ప బంగారం జోలికి వెళ్లలేకుండా ఉన్నామని అంటున్నారు.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. కిలో వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ.2,900 ఎగిసి రూ.80, 700లను తాకింది. నిజానికి గతకొద్ది రోజులుగా పెరుగుతూపోతున్న వెండి ధర.. బుధవారం మాత్రం భారీఎత్తున ఎగిసిపడింది. సంప్రదాయ వినియోగదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచీ డిమాండ్ ఊపందుకోవడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. కాగా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,810 పుంజుకొని రూ.73,950 పలికింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతుందన్న భయాలతో గ్లోబల్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు పెరుగుతూపోతున్నాయి. ఔన్సు గోల్డ్ 2,048 డాలర్లు పలుకుతున్నది. వెండి 24.04 డాలర్లుగా ఉన్నది. గత నెల మొదలు ఆసియా మార్కెట్లలో బంగారం ధరలు 1.80 శాతం ఎగబాకినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అమెరికా డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పడిపోతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లో సెంటిమెంట్ బలపడుతున్నదని వివరించారు. అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో మదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని ఎంచుకుంటారన్నది తెలిసిందే. అందుకే బంగారం ధరలు సహజంగానే పెరుగుతుంటాయని మార్కెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు.