న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 27: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్లలోకి తగ్గించడంతో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.1,25,900కి దిగొచ్చింది.
శనివారం కూడా గోల్డ్ ధర రూ.1,000 తగ్గిన విషయం తెలిసిందే. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర అంతేస్థాయిలో దిగొచ్చి రూ.1,25,300గా నమోదైంది. ఇటు హైదరాబాద్‌లో 24 క్యారెట్ కలిగిన గోల్డ్ ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,25,620గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ కలిగిన తులం బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1.13 లక్షలకు దిగొచ్చింది.
పసిడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.4,250 తగ్గి రూ.1,51,250గా నమోదైంది. అంతకుముందు ఈ ధర రూ.1.55 లక్షలుగా ఉన్నది. వాణిజ్య ఒప్పందంపై కొలిక్కివచ్చే అవకాశాలున్నట్టు అమెరికా-చైనాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ గోల్డ్ ధర ఏకంగా 100 డాలర్లు లేదా 2.40 శాతం తగ్గి 4,015.55 డాలర్లకు పరిమితమైంది.
పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో ధరలు దిగొచ్చాయని, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు కూడా భారీగా విత్‌డ్రా చేసుకోవడం కూడా ధరలపై మరింత ఒత్తిడి పెంచిందని గాంధీ చెప్పారు. సమీప భవిష్యత్తు కాలంలో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోనున్నదని ఆయన అంచనావేస్తున్నారు. అలాగే ఔన్స్ వెండి 2.03 శాతం తగ్గి 47.60 డాలర్ల వద్దకు పడిపోయింది.