న్యూఢిల్లీ, నవంబర్ 18 : బంగారం, వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన రేట్లకు కళ్లెం వేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.3,900 పడిపోయింది. దీంతో రూ.1,25,800గా నమోదైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈసారి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు.. గోల్డ్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయని ట్రేడింగ్ వర్గాలు తాజా సరళిని విశ్లేషిస్తున్నాయి. చివరి ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గిన విషయం తెలిసిందే.
సాధారణంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తే.. బాండ్ మార్కెట్లో రాబడులు తగ్గుతాయని అక్కడి నుంచి మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపునకు మళ్లిస్తారు. దీంతో డిమాండ్ పెరిగి మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎగబాకుతాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే.. ఇన్వెస్టర్లకు బాండ్ మార్కెట్ ఆకర్షణీయంగా మారిపోతుంది. ఫలితంగా పసిడిపై పెట్టుబడులను తగ్గించేసి వాటిని బాండ్లలోకి తరలిస్తారు. దీంతో పుత్తడి ధరలు ఒక్కసారిగా దిగజారిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే. దీంతోపాటు దేశీయ మార్కెట్లో కొనుగోలుదారుల వేచిచూసే ధోరణి సైతం సేల్స్‌ను అమాంతం పడిపోయేలా చేస్తున్నది. పెండ్లిళ్ల సీజన్ అయినప్పటికీ పుత్తడి విక్రయాలు అంతంతమాత్రంగానే సాగుతుండటం ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం ఈ ఒక్కరోజే రూ.1,740 దిగింది. రూ.1,23, 660 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,600 తగ్గి రూ.1,13,350గా ఉన్నది. ఇదిలావుంటే వెండి ధర ఢిల్లీలో ఏకంగా రూ.7,800 పతనమైంది. ఫలితంగా కిలో రూ.1,56,000కు పరిమితమైంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం 4,042.32 డాలర్లకు తగ్గింది. ఈ నెల 12న 4,195.14 డాలర్లు పలకడం గమనార్హం.