Goldman Sachs | న్యూఢిల్లీ, నవంబర్ 27 : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, ముడి చమురు ధరలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా భారీగా పెరుగవచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేస్తున్నది. ఈ క్రమంలోనే ఔన్స్ పసిడి విలువ 2025 డిసెంబర్ నాటికి ఏకంగా 3,150 డాలర్లను తాకవచ్చని చెప్తున్నది. ఇది ప్రస్తుతంతో పోల్చితే 19 శాతం ఎక్కువ కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు ఔన్స్ 2,550 డాలర్ల వద్ద ఉన్నది. కాగా, అంచనా నిజమైతే భారతీయ మార్కెట్లో తులం బంగారం లక్ష దాటేయడం ఖాయం. ఇక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 100 డాలర్లకు చేరవచ్చని అంటున్నది. ఇప్పుడిది 70 డాలర్లలో ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ప్రతికూల పరిస్థితులు.. ఓవైపు మదుపరులను, మరోవైపు డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సురక్షిత మదుపు సాధనమైన బంగారంతోనే తమ పెట్టుబడులకు రక్షణ అని మెజారిటీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నా, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా, అధికారాలు మారి వ్యాపార-వాణిజ్య పరిస్థితులు దిగజారినా.. వెంటనే పెట్టుబడులను గోల్డ్ వైపునకు మళ్లిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఇలాంటి ఘటనలకు ఎక్కువగానే ఆస్కారముందని, పుత్తడి ధరలు ఆల్‌టైమ్ హైల్లోకి చేరడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయిప్పుడు. ఇక పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు క్రూడాయిల్ ధరల్ని సహజంగానే ఎగదోస్తాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇబ్బందికర వాతావరణం తప్పక ముడి చమురును ఖరీదెక్కిస్తుందని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దీనిపై ఐరోపా దేశాల వైఖరి, డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు, చైనాతో సుంకాల పోరు ఇలా అనేకాంశాలతో క్రూడ్ సెంచరీ కొడుతుందన్న అంచనాలు పుష్కలంగా వస్తున్నాయి.
అటు బంగారం కావచ్చు, ఇటు ముడి చమురు కావచ్చు.. ఈ రెండు కమోడిటీ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేస్తున్నది అమెరికా ప్రభుత్వ నిర్ణయాలు, ఆ దేశ ఆర్థిక పరిస్థితులే. వచ్చే ఏడాది జనవరిలో అగ్రరాజ్యంలో అధికార మార్పిడి జరుగనున్నది. ట్రంప్ అధ్యక్షుడు కానున్నారు. దీంతో ట్రంప్ దుందుడుకు వైఖరి, ఇప్పటికే బలహీనంగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ.. గోల్డ్, క్రూడ్ రేట్లను అమాంతం పెంచేస్తాయన్న అంచనాల్ని గోల్డ్‌మన్ సాచ్స్ వేస్తున్నది. ద్రవ్యోల్బణం భయాలు, ఆర్థిక ఇబ్బందులు గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ను పెంచుతాయని, ముఖ్యంగా అమెరికా రుణ భారం.. అమెరికాసహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులను బంగారం కొనుగోళ్లకు ఉసిగొల్పవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ చెప్తున్నది. ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు.. బాండ్, స్టాక్ మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయన్నది తెలిసిందే. దీంతో విదేశీ మదుపరుల పెట్టుబడుల తీరు కూడా ప్రధానం కానున్నది. కరెన్సీ మార్కెట్లో డాలర్ విలువ కదలికల్నీ తక్కువగా చూడలేం. కాగా, ఇరాన్‌కు చమురు సరఫరాపై ట్రంప్ సర్కారు వ్యవహార శైలి, హార్మూజ్ జలసంధి మూసివేత తదితర అంశాలు ముడి చమురు ధరలకు రెక్కల్ని తొడుగుతాయని సాచ్స్ చెప్తున్నది.
వరుసగా రెండు రోజులు భారీగా పతనమైన బంగారం ధరలు బుధవారం కోలుకున్నాయి. హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ రేటు రూ.270 పెరిగి రూ.77,510గా ఉన్నది. సోమ, మంగళవారాల్లో రూ.24,00 పడిపోయిన విషయం తెలిసిందే. 22 క్యారెట్ రూ.250 అందుకుని రూ.71,050 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీలో 10 గ్రాములు 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.650 పుంజుకొని రూ.78,800 పలికింది. కాగా, వెండి ధరల విషయానికొస్తే.. ఈ ఒక్కరోజే కిలో రూ.5,200 ఎగబాకి రూ.95,800లకు చేరింది. అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులు, స్థానిక జ్యుయెల్లర్స్ నుంచి పెరిగిన డిమాండే కారణమని అంటున్నారు.