న్యూఢిల్లీ, మార్చి 21: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గాలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి భారీ స్థాయిలో నిధులు తీసుకొని కొనుగోళ్లు చేసిన వారు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. రికార్డు స్థాయికి చేరుకుంటాయని అంచనావేసిన భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రస్తుతం గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రతరమవుతుండటంతో ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో బంగారం ధరలు భారీగా పెరగాల్సింది పోయి కిందికి పడిపోతున్నాయి. ఈ అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం భవిష్యత్తులో ఎటు పయనిస్తున్నదో అనే బెంగ తీవ్రతరమైంది. ఈ వారంలో గోల్డ్ ధర భారీగా పడిపోయింది. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఏకంగా 4,600 డాలర్ల దిగువకు పడిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా ధరలు పతనానికి ఆజ్యంపోసింది.
1983 తర్వాత ఒకే వారంలో ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. గత నాలుగు దశాబ్దాల క్రితం బంగారం ఇంతటి స్థాయిలో పతనం చెందడం కూడా ఇదే తొలిసారి. 1979-80 మధ్యకాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. అప్పట్లో ఔన్స్ గోల్డ్ ధర 850 డాలర్లకు చేరుకున్నది. అప్పట్లో కూడా ఇప్పటిలాగే ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ మూడేండ్ల తర్వాత 1983 లో గోల్డ్ బుడగ పేలిపోయింది.
ద్రవ్యోల్బణం నియంత్రించే లక్ష్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను సవరించాలని నిర్ణయం తీసుకోవడంతో గోల్డ్ రేటు ఏకంగా పాతాళంలోకి పడిపోయాయి. అప్పట్లో ధర సగానికి సగం 400 డాలర్ల దిగువకు జారుకున్నది. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. 2022 వరకు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నది.
బ్యారెల్ క్రూడాయిల్ ధర 40 డాలర్ల వరకు పెరిగినప్పటికీ బంగారం ధర పెరగక పోవడం విశేషం. భారీగా పడిపోతున్నది. అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్ నెలకొనడం ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బ్యారెల్ క్రూడాయిల్ ధర 200 డాలర్లకు పెరిగితే మాత్రం ఔన్స్ గోల్డ్ మాత్రం 5,400-6,000 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది తొలి నెల జనవరిలో ఔన్స్ ధర 5,600 డాలర్ల పైకి చేరుకున్నది. పలు సెంట్రల్ బ్యాంక్‌లు ఎగబడి కొనుగోలు జరపడం, ఫెడ్ చీఫ్ వ్యాఖ్యలు ధరలు పడిపోవడానికి ప్రధాన కారణాలని ట్రేడర్లు వెల్లడిస్తున్నారు. బంగారంతోపాటు వెండి ధరలు 70 డాలర్ల దిగువకు పడిపోయాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. తీవ్ర హెచ్చుతగ్గుదల మధ్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేయకపోవడం శ్రేయస్కరం. ఈ పరిస్థితులు ఎటువైపు తీసుకెళ్తాయో తెలియదు.
– రాబర్ట్ గొట్లిబ్, జేపీఎం మోర్గాన్ చేస్ అండ్ కో ట్రేడర్