న్యూఢిల్లీ, నవంబర్ 12 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ భగభగమండుతున్నది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా భారీగా పుంజుకుంటున్నది. దేశ రాజధాని నూఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం మరో రూ.2,000 పెరిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,27,900కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1,25, 900గా ఉన్నది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా అంతే స్థాయిలో ఎగబాకి రూ.1,27,300కి చేరుకున్నది. దీంతో గడిచిన రెండు రోజుల్లో గోల్డ్ ధర రూ.3,300 ఎగబాకినట్టు అయింది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. కిలో వెండి ఏకంగా రూ.5,540 ఎగబాకి రూ.1,61,300కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,127 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 51.66 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.