Gold Rates | ధంతేరాస్‌తో ఐదు రోజుల దీపావళి సంబురాలు మొదలవుతాయి. ధంతేరాస్-దీపావళి నాడు ప్రత్యేక పూజలతో మహాలక్ష్మి నట్టింట నడయాడుతుందని భారతీయ మహిళామణుల నమ్మకం. అందుకే మహాలక్ష్మికి, ధన్వంతరికి అత్యంత ఇష్టమైన బంగారం కొనుగోలు చేయడానికి అతివలు మొగ్గు చూపుతుంటారు. భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ కూడా. అందుకే ధంతేరాస్ సందర్భంగా వీలైతే వీసమెత్తు బంగారం కొనడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. ధంతేరాస్‌కు ఒక రోజు ఈ ఏడాది తులం బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. గత ఏప్రిల్ 18న రూ.54,380తో ఆల్‌టైం గరిష్ఠానికి దూసుకెళ్లిన పుత్తడి తర్వాత దిగి వచ్చింది. వరుసగా రెండు వారాలుగా బంగారం ధర పడిపోతూ వచ్చింది. ధంతేరాస్-దీపావళి ముంగిట తులం బంగారం ధర రూ.50వేల మార్క్ దిగువకు చేరుకున్నది.
మల్టీ కమొడిటీ ఎక్స్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర స్వల్పంగా రూ.163 (0.33 శాతం) తగ్గి రూ. 49,980 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లిన తులం బంగారం ధర ఈ వారం రూ.50 వేల మధ్య తచ్చాడుతున్నది. ఫెస్టివ్ సీజన్ వేళ ధరలు దిగి రావడంతో ఇన్వెస్టర్లు పుత్తడిపై పెట్టుబడి పెట్టడానికి అడ్వాంటేజ్ తీసుకుంటారని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు కిలో వెండి ఫ్యూచర్స్ ధర సైతం రూ.283 (0.50 శాతం) పతనమై రూ.56,370 కిలోలకు చేరుకున్నది. స్పాట్ మార్కెట్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ. 50,228 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.56,267 లకు చేరుకుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) పేర్కొన్నది.
అంతర్జాతీయంగా ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 0.3 తగ్గి 1,622.66 డాలర్లకు చేరుకున్నది. ఈ వారంలో గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర సుమారు 1.2 శాతం తగ్గింది. స్పాట్ వెండి ఔన్స్ ధర సైతం 0.7 శాతం తగ్గిపోయి 18.53 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పతనమై 1,629.20 డాలర్లు పలికింది. గత రెండు నెలల్లో స్పాట్ గోల్డ్ తులం ధర రూ. 1,600 తగ్గితే, కిలో వెండి ధర రూ.4,500 పతనమైంది.