న్యూఢిల్లీ, జూలై 11: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.700 ఎగబాకి రూ.99,370కి చేరుకున్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.600 అందుకొని రూ.98, 800 పలికింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గా లు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,500 అందుకొని రూ.1,05,500కి చేరుకున్నది.
ప్రతీకార సుంకాల విధింపు మరింత తీవ్రతరంకానుండటంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ అనలిస్ట్ సౌమిల్ తెలిపారు. కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్, ఇతర దేశాల దిగుమతులపై కూడా 15-20 శాతం వరకు సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ మార్కె ట్లో ఔన్స్ గోల్డ్ 24.63 డాలర్లు ఎగబాకి 3,348.67 డాలర్లకు చేరుకోగా, వెండి 1.64 శాతం అధికమై 37.61 డాలర్లుగా నమోదైంది.