Gold Price | న్యూఢిల్లీ, మే 20: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అతివిలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల పుత్తడి ధర రూ.97 వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్లో తులం ధర రూ.490 తగ్గి రూ.96,540గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.97,030గా ఉన్న ట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.96,130గా నమోదైంది. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరానుండటం, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సీజ్‌ఫైర్‌కు అంగీకరించే అవకాశాలుండటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి రూ.1,000 తగ్గి రూ. 97,500కి దిగొచ్చింది. మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,233.68 డాలర్ల వద్ద ఉన్నది.