న్యూఢిల్లీ, మార్చి 21: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ శుక్రవారం పదిగ్రాముల పుత్తడి ధర రూ.400 దిగి రూ.91,250కి చేరుకున్నది. అతి విలువైన లోహాల ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. దీంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే నమోదుకావడంతోపాటు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.90,800కి చేరుకున్నది. ఈ ధరలు ఢిల్లీకి సంబంధించినవి. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కిలో వెండి కూడా రూ.1,700 తగ్గి రూ.1,00,300కి పరిమితమైంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ మార్కెట్లో ఏప్రిల్ నెల డెలివరీకిగాను గోల్డ్ ధర రూ.493 తగ్గి రూ.88,213గా నమోదైంది.