Gold Rate | దేశవ్యాప్తంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ధంతేరాస్, దీపావళి సమయంలో బంగారం కొనడం ఆనవాయితీగా వస్తుంది. భారతీయ కుటుంబాలకు వివాహాల సమయంలో బంగారం, ఆభరణాలు కొనసాగడం సర్వసాధారణం. కానీ, ఈ సారి పసిడి అందనంత ఎత్తుకు చేరింది. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి బంగారం ధరలు సుమారు 65.04శాతం పెరిగాయని డేటా పేర్కొంటున్నది. ప్రస్తుతం బంగారం రూ.1,26,600 పలుకుతున్నది. ధంతేరాస్, దీపావళి, వివాహాల సమయంలో బంగారం కొనడానికి సాధారణ వినియోగదారులు సంకోచిస్తున్నారు. బంగారం కొనడం సగటు కుటుంబానికి ఒక సవాల్‌గా మారడంతో పాటు ఇబ్బందులుపడుతున్నారు. బంగారం ధరలు పెరగడంపై బులియన్ వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుగుతూనే ఉంటే.. కొనేందుకు ఎవరు వస్తారంటూ భావిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదల గురించి బులియన్ మార్కెట్ నిపుణులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం.
ఎల్‌కేవీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాల కారణంగా అనిశ్చితి, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పెరగడం బంగారం ధరలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి. యూఎస్‌లో అస్థిరత దృష్ట్యా.. ప్రపంచ మార్కెట్లో బంగారం బలపడుతోంది. దేశీయ మార్కెట్లో రాబోయే పండుగలు, వివాహాల సీజన్ బంగారం ధరలలో మంటకు ఆజ్యం పోస్తోందని పేర్కొన్నారు. జేఎంఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ మాట్లాడుతూవినియోగదారులు సాధారణంగా దీపావళి, ధంతేరాస్ సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం, అధిక బంగారం ధరలు పెరగడం కారణంగా శుభసూచకంగా గోల్డ్ కొనుగోళ్లు పరిమితం కావచ్చని పేర్కొన్నారు. పెట్టుబడి కోసం బంగారం ఈటీఎఫ్‌లు, ఇతర విలువైన లోహాలను దశలవారీగా బంగారంలో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుత అధిక ధరల కారణంగా బంగారం కొనుగోళ్లు మంచివి కావని.. సమీప భవిష్యత్తుల్లో ధరలు తగ్గవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం బంగారం,వెండి ధరలు పెరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తే.. ధంతేరస్, దీపావళి వినియోగదారులు బంగారం కొనుగోలు చేయడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఫిజికల్ బంగారు ఆభరణాలు (9 క్యారెట్లు, తేలికపాటి ఆభరణాలు), నాణేలు, బార్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చన్నారు. గోల్డ్ ఈటీఎఫ్ అనేది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఫిజికల్ బంగారం ఉండాల్సిన అవసరం లేదు. మూడోది సావరిన్ గోల్డ్ బాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి. ఇందులో డిఫాల్ట్ ప్రమాదమే ఉండదు. నాల్గోది మ్యూచువల్ ఫండ్. ఇది నిధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా బంగారంపై పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పరిస్థితులను బట్టి బంగారం సురక్షితమైన పెట్టుబడిగా నిపుణులు పేర్కొంటున్నారు. పెట్టుబడిదారులు, వినియోగదారులు తమ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5శాతం నుంచి 10శాతం బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగారం రూ.1.26లక్షలకుపైగా పలుకుతున్నది.