న్యూఢిల్లీ, అక్టోబర్ 4: బంగారం ధరలు మళ్లీ ఆల్టైమ్ హైకి చేరాయి. పండుగ సీజన్ కావడంతో అంతా పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా రూ.78,450గా నమోదైంది. గురువారం ముగింపుతో పోల్చితే రూ.150 పెరిగింది. హైదరాబాద్లో ఇది రూ.77,670గా ఉన్నది. ఇక 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) గోల్డ్ 10 గ్రాముల విలువ కూడా రూ.200 ఎగిసి ఇంతకుముందెప్పుడూ లేనట్టుగా భౌతిక మార్కెట్లో రూ.78,100కి చేరింది. మొత్తానికి నవరాత్రుల సందర్భంగా గోల్డ్ మార్కెట్ కోలాహలంగా మారడం బులియన్ ట్రేడర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.
రూ.80,000 దిశగా..
జ్యుయెల్లర్స్, రిటైలర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తుండటంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఈ నెలాఖరున దీపావళి కూడా ఉండటంతో పసిడి 10 గ్రాములు 80,000 మార్కును తాకే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు ఇంకా పడిపోతే ఇన్వెస్టర్ల నుంచీ ఆదరణ పెరుగుతుందని చెప్తున్నారు. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు ఊహకందని స్థాయిలో ఈ నెల రోజుల్లోనే పెరిగిపోతాయన్న విశ్లేషణలూ వస్తుండటం గమనార్హం.
వెండి రేట్లూ పైపైకి..
బంగారం ధరలకుతోడు వెండి రేట్లూ పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,035 ఎగిసి రూ.94,200గా ఉన్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్లో లక్షపైనే పలుకుతుండటం గమనార్హం. సాధారణ కొనుగోలుదారులతోపాటు ఇన్వెస్టర్లు, ఇండస్ట్రీ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఇదిలావుంటే మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఫ్యూచర్స్ ట్రేడ్లో డిసెంబర్ నెల డెలివరీకిగాను గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాములు రూ.76,375 పలికింది. కిలో వెండి కూడా రూ.93,197గా నమోదైంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,678.90 డాలర్లు, సిల్వర్ 32.37 డాలర్లుగా ట్రేడ్ అవుతున్నది.