Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. విదేశీ మార్కెట్లలో బలమైన ట్రెండ్ మధ్య ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 తగ్గి తులానికి రూ.1,00,420కి చేరుకుంది. 22 క్యారెట్స్ ధర రూ.450 తగ్గి రూ.1,00,050కి పతనమైంది. అలాగే, వెండి ధర సైతం దిగివచ్చింది. రూ.1000 తగ్గి కిలో ధర.. రూ.1,14,000కి చేరినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వైట్ హౌస్‌లో జరిగిన శాంతి చర్చలు ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే ఆశను రేకెత్తించాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. సమావేశంలో యూరోపియన్, నాటో నాయకులు పాల్గొన్నారు.
భారత ప్రభుత్వం జీఎస్టీ నిబంధనల్లో మార్పుల కారణంగా డాలర్, రూపాయి బలహీనపడడం దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ అండ్ కరెన్సీల అధిపతి ప్రవీణ్ సింగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో న్యూయార్క్‌లో స్పాట్ బంగారం 0.15 శాతం పెరిగి ఔన్స్‌కు 3,337.92 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో స్పాట్ వెండి 0.19 శాతం పెరిగి ఔన్స్‌కు 38.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. జాక్సన్ హోల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, ఫెడ్ ఇటీవలి సమావేశం వివరాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో బంగారం ధరలు ఔన్స్‌కు 3,380 కంటే తక్కువగా పడిపోయాయని ఫెడ్ చైర్మన్ ఆగ్మాంట్ పరిశోధనా అధిపతి రెనిషా చైనాని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,00,750 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.92,350 వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.26లక్షలు పలుకుతున్నది.