Silver Price Hike | కొనుగోలుదారులకు వెండి షాక్ ఇచ్చింది. బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,00,920 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల పసిడి రూ.1,00,500 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వెండి రూ.1000 పెరిగి కిలోకు రూ.1,15,000 ధర పలుకుతుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం బులియన్ మార్కెట్ మూతపడిన విషయం తెలిసిందే. వారంలో యూఎస్-రష్యా సమావేశం జరిగింది. ఈ భేటీలో మాస్కో-కీవ్ కాల్పుల విరమణపై స్పష్టమైన పరిష్కారం లేకపోవడంతో బంగారం స్థిరంగా ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీస్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు.
అయితే, చర్చలు సానుకూలంగానే ఉన్నాయని.. శాంతి దిశగా ఏదైనా పురోగతి ఉంటే బంగారంపై ఒత్తిడి తెస్తుందని తెలిపారు. అదే సమయంలో ఆలస్యం జరిగితే ధరలకు మద్దతు ఇచ్చే అవకాశాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరిగి ఔన్స్‌కు 3,349.29 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ 0.35 శాతం పెరిగి ఔన్సుకు 38.14 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం వివరాల కోసం పెట్టుబడిదారులు నిరీక్షిస్తున్నారని ఆగ్మాంట్ పరిశోధనా విభాగం చీఫ్ రెనిషా చైనాని పేర్కొన్నారు. ప్రస్తుత వడ్డీ రేరట్లను కొనసాగించవచ్చన్నారు. లేబర్ మార్కెట్లో అస్థిరత, ద్రవ్యోల్బణం విరుద్ధమైన సంకేతాలు, వడ్డీరేట్ల కోతలు మార్కెట్ పెరుగుదలతో.. యూఎస్ ద్రవ్య విధానంపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ జాక్సన్ హోల్ సింపోజియం 2025లో చేసిన ప్రసంగం బంగారం సెంటిమెంట్‌కు మలుపుగా చైనాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పసిడి రూ.92.750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.1,01,180 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.27లక్షల వద్ద ట్రేడవుతున్నది.