Gold Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బంగారం భగభగమండుతున్నది. సామాన్యుడికి అందనంత స్థాయిలో దూసుకుపోతున్నది. దేశీయంగా పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు పరుగెడుతున్నాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ధరలు శుక్రవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.80 వేలకు చేరువైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.79,900 పలికింది.
గురువారం ముగింపుతో పోలిస్తే తులం ధర రూ.550 ఎగబాకినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఆల్‌టైం హైకీ చేరుకున్నాయి. అటు ఫ్యూచర్ మార్కెట్లోనూ అదే జోరు కనబడింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను పదిగ్రాముల ధర రూ.77,620 వద్ద నిలిచింది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధర రికార్డు స్థాయి రూ.77,667 పలికింది. ఇటు హైదరాబాద్‌లో బంగారం మరింత బలపడింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 అధికమై రూ.78,980కి చేరుకున్నది. ధరలు పెరగకముందు ఇది రూ.78,100గా ఉన్నది. 22 క్యారెట్ల పదిగ్రాముల పుత్తడి ధర రూ.800 ఎగబాకి రూ. 72,400కి చేరుకున్నది. ఇతర నగరాల్లోనూ ధరలు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ. 1,000 అధికమైంది. దీంతో ధర రూ.93, 500 నుంచి రూ.94,500 పలికింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2000 ఎగబాకి రూ.1,05,000 పలికింది. ఎంసీఎక్స్ మార్కె ట్లో డిసెంబర్ డెలివరీ రూ.1,231 లేదా 1.34 శాతం బలపడి రూ.92,975 పలికింది.
దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కావడంతో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరుపుతున్నారు. దసరా సీజన్ ముగిసినప్పటికీ వచ్చేది దీపావళి కావడంతో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు, అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ధరలు పెరగడానికి మరో కారణమన్నారు. ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతో కొనుగోళ్లు శ్రేయస్కరం కాదని సూచనప్రాయంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా మదుపరుల్లో అప్రమత్తత పెంచింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 24.30 డాలర్లు ఎగబాకి 2,731.15 డాలర్లకు, వెండి 32.72 డాలర్లు పలికింది.