న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం తులం బంగారం ధర రూ.1,150 ఎగబాకి రూ.78,500 పలికింది.
ఆభరణాల కొనుగోళ్లు పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. బంగారంతోపాటు వెండి కూడా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.1,500 అధికమై రూ.93 వేలు పలికింది. వరుసగా రెండోరోజు కూడా ధరలు పెరగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 30 డాలర్లు పెరిగి 2,670 డాలర్లకు చేరుకున్నది.