న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బంగారం ధరలు మళ్లీ భగభగమండుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతోపాటు డాలర్‌కు డిమాండ్ బలహీనంగా ఉండటం ధరలు రికార్డు స్థాయికి చేరువయ్యాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర రూ.3,040 ఎగబాకి రూ.1.33 లక్షలకు చేరుకున్నది. గత కొన్ని రోజుల్లో ఒకేరోజు ఇంతటి స్థాయిలో ఎగబాకడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్ కావడంతో ఆభరణాలకు డిమాండ్ నెలకొన్నదని బులియన్ వర్తకులు వెల్లడించారు.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర అంతే స్థాయిలో పెరిగి రూ.1,32,600 పలికింది. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయి రూ.1,34,800కి చేరువయ్యాయని, త్వరలో ఈ రికార్డు కనుమరుగైపోవచ్చని ఓ ట్రేడర్ వెల్లడించారు. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, డాలర్‌కు డిమాండ్ వల్లే ధరలు పెరిగాయి.
బంగారంతోపాటు వెండి రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి కిలో ధర రూ.1.77 లక్షలకు చేరుకున్నది. గత వారం ముగింపుతో పోలిస్తే కిలో విలువ రూ.5,800 ఎగబాకినట్లు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 42.29 డాలర్లు లేదా ఒక్క శాతం బలపడి 4,261.52 డాలర్లు పలికింది.