Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. లక్ష రూపాయలు అధిగమించిన తులం పుత్తడి ధర యూ టర్న్ తీసుకున్నది. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.99,200కి దిగొచ్చింది. అంతకుముందు ఉన్న రూ.1,01,600తో పోలిస్తే రూ.2,400 తగ్గినట్టు అయింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు కరెక్షన్ గురయ్యాయని, చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు త్వరలో గణనీయంగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పుత్తడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. ప్రతీకార సుంకాల విధింపుపై ఆందోళనలు తగ్గుముఖం పడితే బంగారం ధర రూ.94-98 వేల మధ్యలో నమోదుకావచ్చునని చెప్పారు. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో జూన్ నెల డెలివరీకిగాను బంగారం ధర రూ.1,435 తగ్గి రూ.95,905గా నమోదైంది.
ఒకవైపు బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా..మరోవైపు వెండి ధరలు పెరిగాయి. కిలో వెండి రూ.700 అధికమై రూ.99,200 పలికింది. అంతకుముందు ఇది రూ.98,500 గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ ట్రేడర్ వెల్లడించారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 50 డాలర్లు తగ్గి 3,330.99 డాలర్లకు పరిమితంకాగా, వెండి 32.90 డాలర్లకు చేరుకున్నది.
రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ధరల కారణంగా సమీప భవిష్యత్తులో బంగారానికి డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తున్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ విక్రయాలు 9 శాతం నుంచి 11 శాతం లోపు పడిపోవచ్చునని పేర్కొంది. గడిచిన నాలుగేండ్లుగా ఆభరణాల పరిశ్రమ 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, దీంతో 2021 నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీ రెండున్నరరెట్లు అధికమైందన్నారు. రికార్డు స్థాయికి చేరుకున్న ధరలతో వచ్చే అక్షయ తృతీయ రోజు అమ్మకాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. దీంతో రిటైలర్లు అమ్మకాలను పెంచుకోవడానికి ప్రమోషన్లు, డిస్కౌంట్లు ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.