న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : పసిడి కాంతులతో మార్కెట్ ధగధగలాడిపోతున్నది. ఆల్‌టైమ్ హై రికార్డుల్లో కదలాడుతున్న బంగారం ధరలు.. రోజుకింత పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ధంతేరాస్ (శనివారం)కు మరింత పెరిగే వీలుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు దేశీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1.30 లక్షలను తాకవచ్చన్న అభిప్రాయాలైతే గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. నిజానికి గత ఏడాది ముగింపుతో చూస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రేట్లు దాదాపు 50 శాతం పుంజుకున్నాయి.
2022 నుంచి గమనిస్తే.. ఏకంగా 140 ఎగబాకడం గమనార్హం. ఇక కొందరు ఎక్స్పర్ట్స్ త్వరలోనే తులం విలువ దేశీయంగా రూ.1.50 లక్షలకు వెళ్తుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కరెన్సీ సంక్షోభమో, భౌగోళికంగా-రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులో ఏర్పడితే తప్ప.. ఈ ధంతేరాస్‌కు లేదా ఈ పండుగ సీజన్లో బంగారం ధర భారతీయ మార్కెట్లో తులం రూ.1.50 లక్షలను దాటదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈసారికైతే 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,26,000-1,28,000 శ్రేణిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మొండికేస్తున్న ద్రవ్యోల్బణం, స్థిరత్వం లోపించిన కరెన్సీ-స్టాక్ మార్కెట్లు, దేశాల మధ్య పెచ్చుమీరుతున్న రక్షణాత్మక ధోరణులు, గణనీయమైన డిజిటల్ మార్పులు ఇదీ.. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం. అయితే వీటన్నింటికీ ఇప్పుడు మెజారిటీ దేశాలు పరిష్కారంగా చూస్తున్నది ఒక్క బంగారాన్నే. అవును.. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడబెడుతున్న పసిడి నిల్వలే ఇందుకు నిదర్శనం. గోల్డ్ రిజర్వ్‌లు పెంచుకుంటే భవిష్యత్తుకు ఢోకా లేదన్న అభిప్రాయమే దీని వెనుక కారణంగా కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులూ అందుకు తగ్గట్టుగాను ఉంటుండటం గమనార్హం. ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారాలంటే.. ఆయుధ సంపత్తి కాదు.. ఆర్థిక పరిపుష్ఠే మార్గం. అందుకు బంగారమే దగ్గర దారిగా మారుతున్నది మరి.
దేశీయ మార్కెట్లో తులం మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1,27,950 పలికింది. సోమవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,950 ఎగిసింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనమైన పసిడి వైపునకు మళ్లిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో డిమాండ్ పెరుగుతున్నట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక కిలో వెండి ధర ఈ ఒక్కరోజే రూ.7,500 ఎగసింది. దీంతో రూ.1,79,000గా నమోదైంది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి కూడా వెండికి ఆదరణ కనిపిస్తున్నది. పండుగ సీజన్ సెంటిమెంట్ కూడా తోడవుతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం రేటు రూ.1,25,400, 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.1,14,950గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,096.64 డాలర్లు, సిల్వర్ 51.99 డాలర్లు పలుకుతున్నాయి.
దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ధంతేరాస్‌కు తులం బంగారం ధర రూ.1,20,000-1,30,000 పలకవచ్చు. అంతర్జాతీయం గా ఔన్స్ విలువ 4,150-4,250 డాలర్లకు వెళ్లవచ్చు. దీన్నిబట్టి వచ్చే ఏడాది ఆరంభంలోనే 24 క్యారెట్ 10 గ్రాములు రూ.1,50,000 తాకవచ్చనిపిస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక విపత్కర పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది తులం బంగారం ధర రూ.1.50 లక్షలు దాటిపోతుంది. సెంట్రల్ బ్యాంకులు భారీగా గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటుండటం వల్లే రేట్లు ఈ స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. నిరంతర భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో క్షీణత వంటికి కూడా పుత్తడి డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తే.. బాండ్ మార్కెట్లలోని పెట్టుబడులు బంగారం వైపునకు మళ్లుతాయి. అప్పుడు ధరలు ఇంకా పెరగవచ్చు.