దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా విజృంభించాయి. మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతూ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. మంగళవారం గోల్డ్ రేటు తులం రూ.1,12,750 తాకితే.. సిల్వర్ కిలో రూ.1,28,800 పలికింది. ఒక్కరోజే అటు పుత్తడి రూ.5,080, ఇటు వెండి రూ.2,800 పుంజుకున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లోనూ పసిడి విలువ నయా రికార్డుల్ని సృష్టించింది. మరోవైపు ధరలు ఇలాగే దౌడుతీస్తే త్వరలోనే కిలో వెండి ధర రూ.1.50,000 చేరడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 : బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం దేశీయంగా ఆల్‌టైమ్ హై రికార్డుల్ని నెలకొల్పాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు 10 గ్రాములు ఈ ఒక్కరోజే ఏకంగా రూ.5,080 ఎగబాకి తొలిసారి రూ.1,12,750 వద్ద నిలిచింది. ఈ మేరకు అఖిల భారత సరఫా అసోసియేషన్ ప్రకటించింది. అలాగే కిలో వెండి ధర రూ.2,800 ఎగిసి మొదటిసారి రూ.1,28,800 వద్ద స్థిరపడింది. దీంతో ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా గోల్డ్, సిల్వర్ రేట్లు భారతీయ మార్కెట్లో దాదాపు 44 శాతం పుంజుకున్నైట్టెంది.
హైదరాబాద్‌లోనూ పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే 24 క్యారెట్ తులం రూ.1,10,290గా నమోదైంది. సోమవారంతో పోల్చితే రూ.1,360 పెరిగింది. ఇక 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) బంగారం రేటు రూ.1,01,100 పలికింది. ఈ ఒక్కరోజే రూ.1,250 ఎగిసింది. కాగా, గత 5 రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ ధర రూ.3,430, 22 క్యారెట్ రేటు రూ.3,150 పెరిగినట్టు స్థానికి మార్కెట్ వర్గాలు తెలియజేశాయి.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇంతలా పరుగులు పెట్టడానికి.. ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమైన డిమాండ్ కూడా కారణమంటూ మార్కెట్లో తాజా ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ సైతం కలిసొచ్చిందని చెప్తున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టించింది. ఒకానొక దశలో తొలిసారి 3,659.27 డాలర్లు పలికింది. చివరకు 3,652.72 డాలర్ల వద్ద నిలిచింది. ఈ ఒక్కరోజే 16.81 డాలర్లు పెరగడం విశేషం. గత వారం అమెరికాలో లేబర్ మార్కెట్ డాటా బలహీనంగా నమోదు కావడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్ వైపునకు మళ్లించారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు సైతం ఇన్వెస్టర్లను పసిడి వైపు చూసేలా చేస్తున్నాయంటున్నారు.
స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం ధరలు కొత్త శిఖరాలను అధిరోహించాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై డిసెంబర్ నెల డెలివరీకిగాను తులం రూ.1,10,312 పలికింది. మునుపటితో చూస్తే రూ.723 ఎక్కువ. మరోవైపు అంతర్జాతీయంగా కొమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో డిసెంబర్ డెలివరీకి మునుపెన్నడూ లేనివిధంగా ఔన్స్ 3,698.02 డాలర్లుగా నమోదైంది. ఇదిలావుంటే రాబోయే రోజుల్లో వెండి ధరలు భారతీయ మార్కెట్లో మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో కిలో రేటు క్రమేణా పెరిగి రూ.1,50,000కు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెప్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ 50 డాలర్లకు చేరవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.