న్యూఢిల్లీ, జనవరి 22: బంగారం ధర ఇప్పటికే దడ పుట్టిస్తున్నది. దేశీయంగా మేలిమి బంగారం (24 క్యారెట్ లేదా 99.9 స్వచ్ఛత) తులం రూ.1.5 లక్షలకుపైగానే పలుకుతున్నది. దీంతో సంపన్న వర్గాలేగానీ సామాన్యులు పసిడివైపు చూడలేని పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ రేట్లు ఇక్కడితో ఆగవంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇలాగే చూస్తూపోతే పుత్తడి 10 గ్రాముల విలువ రూ.2.5 లక్షలను తాకడం ఎంతోకాలం పట్టకపోవచ్చన్న అంచనాలు వస్తుండటం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు 73 శాతం పుంజుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 4,800 డాలర్ల మార్కును దాటేసింది. అయితే మరో 46 శాతం పెరుగుదలకు వీలుందని, 7,000 డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయిప్పుడు. ఇదే జరిగితే భారతీయ మార్కెట్లో తులం ధర రూ.2.5 లక్షలకుపైనే నమోదు కాగలదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, తదనుగుణంగా మారుతున్న ఇన్వెస్టర్ల సంప్రదాయ పెట్టుబడి సరళి.. రేట్లను పరుగులు పెట్టిస్తున్నాయని మెజారిటీ నిపుణులు అంటున్నారు.
వరుస ట్రేడింగ్ సెషన్లలో పెరుగుతూపోయిన బంగారం, వెండి ధరలు.. ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయికి చేరాయి. అయితే గురువారం మాత్రం తగ్గుముఖం పట్టాయి. గ్రీన్లాండ్ వ్యవహారంలో యూరోపియన్ దేశాలపై విధించాలనుకున్న భారీ అదనపు సుంకాలకు బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుండటం వల్లే బుల్ రన్‌కు బ్రేకులుపడ్డాయి. ఈ క్రమంలోనే ఈక్విటీ మార్కెట్లకు మళ్లీ జోష్ వచ్చింది. అయినప్పటికీ లాంగ్ రన్లో గోల్డ్, సిల్వర్‌కు ఆదరణ కొనసాగుతుందనే మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక ఒడిదుడుకులే ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి.
బంగారం, వెండి ధరల రికార్డ్ రన్‌కు బ్రేక్ పడింది. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.2,500 దిగజారి రూ.1,57,200గా నమోదైంది. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,59,700 పలికిన విషయం తెలిసిందే. ఇక కిలో వెండి ధర ఈ ఒక్కరోజే రూ.14,300 పడిపోయింది. రూ.3,20,000 వద్ద స్థిరపడింది. క్రితం రోజు ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయి రూ.3,34,000 వద్ద ముగిసిన సంగతి విదితమే.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం బంగారం రూ.1,41,450గా ఉన్నది. అలాగే కిలో వెండి రేటు రూ.3,20,000గా ట్రేడైందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడమే ధరల క్షీణతకు కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలావుంటే ఫ్యూచర్ మార్కెట్లోనూ ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి.
మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై ఫిబ్రవరి డెలివరీకిగాను గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల విలువ రూ.1,088 తగ్గి రూ.1,51,774గా ఉన్నది. మునుపటి సెషన్లో రూ.1,52,862గా నమోదైంది. ఒకానొక దశలోనైతే రికార్డు స్థాయిలో రూ.1,58,475 పలుకడం విశేషం. ఇక సిల్వర్ మార్చికిగాను కిలో రూ.3,16,958 పలికింది. బుధవారం ముగింపుతో చూస్తే రూ.1,534 దిగింది. అంతర్జాతీయ మార్కెట్ కొమెక్స్లోనూ ఔన్స్ గోల్డ్ ఫిబ్రవరి డెలివరీకి 4,828.74 డాలర్లుగా ఉన్నది. 8.76 డాలర్లు క్షీణించింది. మార్చి కాంట్రాక్ట్‌కు సిల్వర్ కూడా 1.30 డాలర్లు తగ్గి ఔన్స్ 93.94 డాలర్లకు పరిమితమైంది.
నిరంతర భౌగోళిక-రాజకీయ అనిశ్చిత స్థితి, అధిక ద్రవ్యలోట్లు, సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి కొనసాగుతున్న డిమాండ్లే గతకొద్ది నెలలుగా పెరుగుతున్న బంగారం ధరలకు ప్రధాన కారణాలు. ఈ పరిస్థితులనుబట్టి చూస్తే.. షార్ట్ టర్మ్ ట్రేడ్ కంటే లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోగా పుత్తడి నమ్మదగినదిగానే కనిపిస్తున్నది. కనుక రాబోయే సంవత్సరాల్లోనూ పసిడికి డిమాండ్ పదిలమేనని చెప్పవచ్చు. వచ్చే 2-3 ఏండ్లలో ఔన్స్ గోల్డ్ దాదాపు 7,040 డాలర్లకు చేరగలదని మా అంచనా.
-అపూర్వ సేథ్, సామ్కో సెక్యూరిటీస్ అనలిస్ట్
అంతర్జాతీయ మార్కెట్లో రాబో యే నెలల్లో ఔన్స్ గోల్డ్ విలువ 6,600 డాలర్లు పలుకవచ్చు. ప్రస్తుత బుల్ మార్కెట్‌ను చూస్తుంటే.. బంగారం ధరలు ఇకపైనా జెట్ స్పీడ్‌తో దూసుకుపోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. నిజానికి గత కొన్నేండ్లుగా గమనించినైట్టెతే.. అమెరికన్ల తలసరి ఆదాయంలో పసిడి రేటు సమీప కాల అంచనాలు సాధారణంగా 9.9 శాతానికి సమానంగా ఉంటున్నాయి. ఈ లెక్కన చూస్తే కొద్ది నెలల్లో ఔన్స్ గోల్డ్ తప్పక 6,571 డాలర్లకు చేరగలదు.
-క్రిస్టోఫర్ వుడ్, జెఫెరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్