న్యూఢిల్లీ, నవంబర్ 12 : బంగారం క్రమంగా దిగొస్తున్నది. రికార్డు స్థాయికి ధరలు చేరుకోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరుసగా రెండోరోజు మంగళవారం పుత్తడి భారీగా దిగొచ్చింది. దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం ప్యూరిటీ కలిగిన తులం బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.77,800కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.79,550గా ఉన్నది. 99.5 క్యారెట్ ధర రూ.1,750 తగ్గి రూ.77,400కి తగ్గింది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.1,470 తగ్గి రూ.77,290కి దిగొచ్చింది.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో ఢిల్లీలో కిలో వెండి రూ.2,700 తగ్గి రూ.91,300కి తగ్గింది. అంతకుముందు ఇది రూ.94 వేలుగా ఉన్నది. ఇటు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.2 వేలు తగ్గి రూ.1.02 లక్షల నుంచి లక్ష రూపాయలకు దిగింది.