న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం ఆల్‌టైమ్ హై రికార్డులతో పరుగులు పెట్టిన రేట్లు.. ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు వారం రోజుల్లో తులం పసిడి విలువ రూ.10 వేలదాకా, కిలో వెండి రూ.20 వేలవరకు క్షీణించాయి.
హైదరాబాద్‌లో..
బుధవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు రూ.1,25,000 నుంచి రూ.1,26,000 మధ్య ఉన్నది. మంగళవారంతో పోల్చితే రూ.4,000 నుంచి రూ.5,000 దిగొచ్చింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి ధర రూ.1,15,000 నుంచి రూ.1,16,000 పలికింది. ఒక్కరోజులో రూ.4,000 నుంచి 5,000 క్షీణించినట్టు స్థానిక మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక కిలో వెండి ధర రూ.1,65,000గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.7,000 దిగిరావడం గమనార్హం. నిజానికి దేశీయ స్పాట్ మార్కెట్లో ఈ నెల 17న 24 క్యారెట్ తులం బంగారం ధర మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,34,800గా ఉన్నది. అలాగే 14న కిలో వెండి రూ.1,85,000 పలికింది.
వేచిచూసే ధోరణిలోకి..
ఇన్నాళ్లూ పెరుగుతూపోయిన ధరలు.. ఇప్పుడు క్రమేణా తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. అయితే ప్రస్తుత పండుగ సీజన్‌తోపాటు పెండ్లిళ్ల సీజన్ దృష్ట్యా అవసరం ఉన్నంత మేరకే కొనడానికి ముందుకొస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ వాల్యూ రూ.55 వేలు ఎగబాకింది. ఇక కిలో వెండి రేటు ఏకంగా రెట్టింపునకు పైగా ఎగసింది. గత ఏడాది ఆఖర్లో తులం బంగారం రూ.78,950గా, కిలో వెండి రూ.89,700గా ఉన్నాయి మరి. దీంతో మున్ముందు మరింతగా ధరలు దిగివస్తాయన్న ఆశాభావంతో కస్టమర్లు తమ కొనుగోళ్లను ఇప్పటికైతే వాయిదానే వేసుకుంటున్నారని జ్యుయెల్లర్స్ ప్రస్తుత వ్యాపార సరళిని వివరిస్తున్నారు. ఈసారి ధనత్రయోదశి (ధంతేరాస్) అమ్మకాలు కూడా అంతంతమాత్రంగానే జరిగినట్టు దేశవ్యాప్తంగా ఉన్న జ్యుయెల్లర్స్ చెప్తున్న సంగతి విదితమే. అధిక ధరల కారణంగా విక్రయాలు తగ్గినట్టు నగల వర్తకులు అంటున్నారు.
ఇదీ సంగతి..
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇంతలా దిగిరావడం వెనుక అంతర్జాతీయ కారణాలే కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,109.19 డాలర్లుగా ఉన్నది. సోమవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ హైని తాకుతూ 4,381.21 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం 2020 ఆగస్టు నుంచి గమనిస్తే ఎప్పుడూ లేనంతగా ఏకంగా 5 శాతానికిపైగా ధరలు పతనమైయ్యాయి. బుధవారం ఆ క్షీణత కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురై లాభాల స్వీకరణకు దిగుతున్నారు. దీంతో డిమాండ్ తగ్గి ధరలు ఇంకా పడిపోతున్నాయని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. అలాగే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్‌తోనూ అగ్రరాజ్యం ట్రేడ్ డీల్ దిశగా వెళ్తున్నది. ఫలితంగా భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ వేసిన సుంకాలు 35 శాతం మేర తగ్గుముఖం పట్టవచ్చన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఇవి సహజంగానే గోల్డ్కున్న డిమాండ్‌ను అమాంతం తగ్గించేశాయి. కాగా, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు మదుపరులకు రుచించకపోతే గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడుల ఉపసంహరణలు మరింత దిగజారే వీలున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, ముఖ్యంగా ఆయా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శాంతిస్తే.. పసిడి ధరలు పెద్ద ఎత్తునే దిగివస్తాయన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
880 మెట్రిక్ టన్నులకు..
ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నులను దాటిపోయాయి. 2025-26 ప్రథమార్ధం ముగింపు (ఈ ఏడాది సెప్టెంబర్ 30)కల్లా 880.18 టన్నులుగా ఉన్నట్టు ఆర్బీఐ తాజా గణాంకాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 26 నాటికి ఈ పసిడి విలువ 95 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా. గత నెల చివరి వారంలో పుత్తడి నిల్వలు 0.2 మెట్రిక్ టన్నులు పెరిగినట్టు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్‌లో ఆర్బీఐ 600 కిలోల బంగారం కొన్నది. కాగా, ఈ ఏడాది మార్చి 31న ఆర్బీఐ వద్దనున్న పసిడి నిల్వలు 879.58 టన్నులు. గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ 54.13 మెట్రిక్ టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ బంగారానికి డిమాండ్ పెరుగుతుండగా, మదుపరులు దీన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. భారత్ సహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులూ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. నేటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల వల్ల అనుకోని ఒడిదొడుకులు సంభవిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంగా ఈ రిజర్వులు ఉంటాయన్నది బ్యాంకర్ల నమ్మకం.