Gold Price | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: బంగారం ధరలు క్రమంగా దిగొచ్చాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగియడం, స్టాకిస్టులు, రిటైలర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు సోమవారం కూడా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.79 వేల దిగువకు పడిపోయి రూ.78, 350 వద్ద ముగిసింది.
అంతకుముందు ఇది రూ.79,500గా ఉన్నది. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.300 దిగి రూ.92,500గా నమోదైంది. గత రెండు సెషన్లలో కిలో వెండి ఏకంగా రూ.4,500 తగ్గినట్లు అయింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నూతన ఆర్థిక సంస్కరణలతో కొనుగోలుదారుల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నదని, దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడం ధరలు తగ్గాయని ట్రేడర్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,678.50 డాలర్లకు చేరుకోగా, వెండి 31.11 డాలర్ల వద్ద ఉన్నది.