న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన గోల్డ్వైపు మళ్లించడంతో ధరలు పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీలో పసిడి ధర మళ్లీ రూ.61 వేల మార్క్ దాటింది.
రూ.340 పెరిగి తులం రూ.61,280 పలికింది. వెండి ఏకంగా రూ.1,110 అధికమై రూ.77,150కి చేరుకున్నది. హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.110 తగ్గి రూ.61,200 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.100 తగ్గి రూ.56,100గా నమోదైంది. వెండి కిలో రూ.400 పెరిగి రూ.81, 800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,027 డాలర్లకు, వెండి 25.61 డాలర్లకు చేరుకున్నది.