న్యూఢిల్లీ, మే 12 : ఒక సంవత్సరంపాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నగల మార్కెట్లో ఒకింత అలజడి కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే పసిడి ఆభరణాల తయారీకి పేరుగాంచిన జైపూర్ గోల్డ్ జ్యుయెల్లరీ మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మోదీ మాటలతో బంగారు నగలకు డిమాండ్ తగ్గిపోయి, అమ్మకాలు పడిపోతాయేమోనన్న భయాల్ని ట్రేడర్లు వెలిబుచ్చారు. పుత్తడికి ఆదరణ తగ్గితే జ్యుయెల్లరీ ఫ్యాక్టరీలు, షోరూంలలో పనిచేసే స్వర్ణకారులు, ఇతర ఉద్యోగుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందన్నారు. ఇక బంగారం లభ్యతలోగానీ లేదా డిమాండ్లోగానీ ఏదైనా క్షీణత చోటుచేసుకుంటే నేరుగా అది ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, చిరు వ్యాపారాలనే దెబ్బతీస్తుందని పరిశ్రమ ప్రతినిధులు హెచ్చరించారు.
ఏటా ఒక్క రాజస్థాన్లోని ఇండస్ట్రీనే దాదాపు 42-45 టన్నుల బంగారం వాడుతుందన్న ట్రేడర్లు.. పెండ్లిళ్లకు, సంప్రదాయ జ్యుయెల్లరీ, రత్నాభరణాలకు గిరాకీ బాగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడి పరిశ్రమలపై లక్షలాది కళాకారులు, డిజైనర్లు, పాలిషర్లు, స్మాల్ ట్రేడర్లు, ఎగుమతిదారులు ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ పిలుపు వీరందరినీ రోడ్డునపడేసేలా ఉందన్న ఆందోళనలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే దేశంలోని ప్రజలు, ఆలయాలు, ఇతరత్రా పెట్టుబడుల్లో దాదాపు 20వేల టన్నుల బంగారం ఉందని, దాన్ని రీసైక్లింగ్, ఎక్సేంజ్, రీయూజ్, మానిటైజేషన్ చేస్తే దిగుమతుల్ని తగ్గించుకోవచ్చని ప్రముఖ రిటైల్ జ్యుయెల్లర్స్ అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా రత్నాలు, ఆభరణాల కోసం జైపూర్ ప్రత్యేక మార్కెట్. ఉపాధి, హస్తకళలు, ఎగుమతులు, పర్యాటకం, సంస్కృతీ, సంప్రదాయాలకు ఈ నగరం నెలవు. లక్షలాది కుటుంబాలు ఈ నగరంపై ముఖ్యంగా స్థానిక జ్యుయెల్లరీ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పుడు బంగారానికి డిమాండ్ పడిపోతే వారందరికీ సవాళ్లు తప్పవు.
దేశంలోని బంగారాన్నే రీసైక్లింగ్, మార్పిడి, పునర్వినియోగం, నగదీకరణ చేస్తే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల ప్రజలు పసిడి కొనుగోళ్లను వాయిదా వేయాల్సిన అవసరం ఉండదు. నిజానికి నగల కొనుగోళ్లు నేరుగా కొత్త బంగారం దిగుమతులకు కారణం కావడం లేదు. పైగా దేశ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నగల తయారీ పరిశ్రమ వాటా ఎంతో ఉన్నది.