బంగారం తాకట్టుపై రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) రేషియోను ఆర్బీఐ పెంచింది. రుణం రూ.2.5 లక్షలలోపుంటే.. తనఖా పెట్టిన బంగారం విలువలో 85 శాతం వరకు అప్పు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 75 శాతమే. అలాగే రూ.2.5 లక్షలు-రూ.5 లక్షల మధ్య రుణగ్రహీతలకు 80 శాతంగా ఎల్టీవీ నిష్పత్తిని నిర్ణయించింది. రూ.5 లక్షలకుపైగా గోల్డ్ లోన్లు తీసుకునేవారికి ఎల్టీవీ 75 శాతంగా వర్తిస్తుంది. దీంతో ఇంతకుముందు ఆర్బీఐ గోల్డ్ లోన్లకు సంబంధించి చేసిన ప్రకటనలకు స్పష్టత ఇచ్చినైట్టెంది. కాగా, ఎల్టీవీ రేషియో.. రుణం తీసుకునే రోజు తనఖా కోసం తెచ్చిన బంగారం విలువపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తులం బంగారం తనఖా పెట్టి రుణం తీసుకోవాలనుకున్నారు. ఆ రోజు మీ బంగారం విలువను రూ.80,000గా తేల్చారు. దీని ప్రకారం మీకు గరిష్ఠంగా రూ.68,000 రుణం (రూ.80,000లలో 85 శాతం)గా వస్తుంది. ఒకవేళ బుల్లెట్ రీపేమెంట్ రుణాలైతే.. ఎల్టీవీ లెక్కింపు మెచ్యూరిటీ సమయంలో చెల్లించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది.