Gold Rates | అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు దేశీయంగానూ గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలకు గురువారం రెక్కలొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్స్ బంగారం తులం ధర. 550 వృద్ధి చెంది రూ.72,500లకు చేరుకున్నది. గత నెల 23న కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పటి నుంచి పతనమవుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. బుధవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.71,950గా రికార్డయింది. కిలో వెండి ధర కూడా రూ.600 పెరిగి రూ.86,200లకు చేరుకున్నది. బుధవారం కిలో వెండి ధర రూ.85,600 వద్ద నిలిచింది.
అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధర 17 డాలర్లు పెరిగి 2490 డాలర్లకు చేరింది. కామెక్స్ సిల్వర్ ఔన్స్ ధర 0.65 శాతం వృద్ధి చెంది 29.13 డాలర్లకు చేరుకున్నది. మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం కూడా మున్ముందు బంగారం ధర పెరుగదలకు కారణం అవుతుందని అంచనా వేస్తున్నారు.