హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నడు.. బయట అధికార పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ తొడ కొడుతున్నడు. లోపల మాత్రం పిల్లి గంతులు వేస్తున్నడు’ అని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ విమర్శించారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ శనివారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్వహించిన విచారణకు వివేకానందగౌడ్ పిటిషనర్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి పార్టీ మారినట్టు రుజువుచేసే ఆధారాలు, అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ అగ్రనేతలతో ఉన్న ఫొటోలను స్పీకర్‌కు అందజేశారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన కడియం శ్రీహరి బయట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను దూషిస్తూ స్పీకర్ ఎదుట మాత్రం నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ‘అనేక పదవులు అనుభవించిన ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నడు. అయోమయంలో అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తున్నడు. నేను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ వాళ్లు అపోహలో ఉన్నరని చెప్తున్నడు.. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిగా వ్యవహరించిన దీపాదాస్మున్షీ తెలియదని ఒకసారి.. తెలుసని ఇంకోసారి సమాధానమిస్తున్నడు.
పేపర్లో ఫొటో ఎక్కడిదని ప్రశ్నిస్తే అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నడు’ అని విమర్శలు గుప్పించారు. కడియం తనకు తానే రాజకీయ సమాధి కట్టుకొని స్థాయిని దిగజార్చుకున్నారని నిప్పులు చెరిగారు. పార్టీ మారి బుకాయింపులతో కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఫొటోలు, పోస్టులను తన అభిమానులు పోస్ట్ చేస్తున్నారని బుకాయించి స్పీకర్‌ను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. కడియం శ్రీహరి ఎంత బుకాయించినా, స్పీకర్‌ను తప్పుదోవపట్టించినా కోర్టులో తప్పించుకోలేరని స్పష్టంచేశారు. న్యాయస్థానంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.