Gold Rates | మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు (Tariff) విధిస్తూ అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం.. ఫారెక్స్ మార్కెట్ (Forex Market)లో రూపాయి మారకం విలువ జీవిత కాల గరిష్టానికి పతనం కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గం బంగారంపై మోజు పెంచుకున్నారు. సుంకాల పెంపుతో అంతర్జాతీయ మార్కెట్లో.. రూపాయి విలువ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో రూపాయి జీవిత కాల గరిష్టానికి దూసుకెళ్లింది.
మరోవైపు, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో జ్యువెల్లర్లు, స్టాకిస్టుల నుంచి గిరాకీ పెరగడంతో వరుసగా నాలుగో సెషన్లో దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) రూ.400 వృద్ధి చెంది రూ.85,300లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది. శనివారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం (10 గ్రాములు) ధర రూ.84,900 పలికింది. మరోవైపు, కిలో వెండి ధర సోమవారం వరుసగా ఐదో రోజు రూ.300 పెరిగి రూ.96,000లకు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.95,700 వద్ద స్థిర పడింది. మెక్సికో, కెనడా, చైనాలపై ట్రంప్ విధించిన సుంకాలతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ సోమవారం ఒక్కరోజే 55 పైసలు పతనమై ఆల్ టైం కనిష్టం రూ. 87.17 లకు పరిమితమైంది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం బంగారం ధర రూ.461 (0.56శాతం) పుంజుకుని రూ.82,765 వద్ద స్థిర పడింది. ‘ఎంసీఎక్స్‌లో బంగారం ధగధగ మెరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ట్రేడ్ వార్ 2.0 కు శ్రీకారం చుట్టడంతో ఇన్వెస్టర్లలో బంగారానికి డిమాండ్ పెరిగింది’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్లో సమర్పించడంతో శనివారం ఒక్కరోజే తులం బంగారం ఏప్రిల్ డెలివరీ ధర రూ.1,127 పెరిగి రూ. 83,360 లకు చేరుకుంది. కిలో వెండి ఫ్యూచర్స్ మార్చి డెలివరీ ధర రూ.436 (0.47 శాతం వృద్ధితో రూ.93,650 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం 7.50 డాలర్లు (0.26 శాతం) పతనమై 2827.50 డాలర్లు పలికింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో డాలర్‌పై బంగారం బలహీన పడింది. మూడు వారాల గరిష్టానికి డాలర్ బలోపేతమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్ (ఫ్యూచర్స్)లో ఔన్స్ బంగారం ధర 2,862.90 డాలర్లతో మరో జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసుకుంది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 32.10 డాలర్లు పలికింది.