Gold Rates | అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడంతోపాటు జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లకు బంగారం స్వర్గధామంగా కనిపిస్తున్నది. దీంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.350 పుంజుకుని రూ.79,200లకు చేరుకున్నది. గురువారం తులం బంగారం ధర 78,850 వద్ద స్థిర పడింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.350 పెరిగి రూ.78,800 పలికింది. ఇక వరుసగా నాలుగో సెషన్లో శుక్రవారం కిలో వెండి ధర రూ.900 వృద్ధి చెంది రూ.91,700లకు చేరుకున్నది. నాలుగు సెషన్లలో కిలో వెండి ధర రూ.3,550 వృద్ధి చెందింది.
నెలాఖరులో బ్యాంకర్లు, దిగుమతి దారుల నుంచి డిమాండ్ పెరిగిపోవడంతో డాలర్‌పై రూపాయి విలువ భారీగా పతనమైంది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ దాదాపు రెండేండ్ల రూ.85.80లకు పతనమైంది. తిరిగి ఆర్బీఐ జోక్యంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 23 పైసల నష్టంతో రూ.85.50 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్ ఫిబ్రవరి డెలివరీ ధర రూ.56 క్షీణించి రూ.76,771లకు చేరుకున్నది. మార్చి డెలివరీ సిల్వర్ కాంట్రాక్ట్స్ కిలో ధర రూ.27 పతనమై రూ.89,609లకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ గోల్డ్ ధర 13.70 డాలర్లు పడిపోయి 2,640.20 డాలర్లు పలికింది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 0.74 శాతం పతనంతో 30.17 డాలర్లకు చేరుకుంది.