Silver- Gold Rates | అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.120 వృద్ధి చెంది రూ.72,550 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం సెషన్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,430 వద్ద ముగిసింది. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.900 పుంజుకుని రూ.92,300 వద్ద స్థిర పడింది. బుధవారం కిలో వెండి ధర రూ.91,400 వద్ద ముగిసింది.
ఢిల్లీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ (24 క్యారట్స్) తులం ధర రూ.120 పెరిగి రూ.72,550లకు చేరుకుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర ఐదు డాలర్లు వృద్ధి చెంది 2332 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో సిల్వర్ ఔన్స్ ధర 30.15 డాలర్ల వద్ద ముగిసింది. బుధవారం సిల్వర్ ఔన్స్ ధర 29.40 డాలర్ల వద్ద స్థిర పడింది.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది స్పందిస్తూ.. వచ్చే సెప్టెంబర్ నెలలో యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారన్నారు. ఒకవేళ వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తే బంగారంపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు.