Gold Jewellery | బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. ప్రతి ఒక్కరూ పండుగలు, కుటుంబ శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలని తలపోస్తారు. సాధ్యం కాకుంటే ఉన్న బంగారం ఆభరణాలే ధరిస్తారు. కానీ, కొనేండ్లుగా బంగారం ఆభరణాల వినియోగం క్రమంగా వృద్ధి చెందుతోంది. దీనికి తోడు దేశీయంగా బంగారం దిగుమతిపై సుంకాల తగ్గింపు.. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయంగా బంగారం ధరల్లో ఒడిదొడుకులు.. వినియోగదారుడి సెంటిమెంట్ బలోపేతం.. పెండ్లిండ్లూ పండుగల సీజన్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బంగారం ఆభరణాల వినియోగం 14-18 శాతం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బంగారం ఆభరణాల వినియోగం 18 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో బంగారం కడ్డీలు, బంగారం నాణెల కొనుగోళ్లు పెరిగాయి. 2024 జూలైలో బంగారం దిగుమతిపై సుంకం 900 బేసిక్ పాయింట్లు తగ్గించడం, దరిమిలా కొంతకాలం బంగారం ధరల్లో సర్ధుబాట్లు నమోదయ్యాయి. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ త్రైమాసికంలో బంగారం ఆభరణాల కొనుగోళ్లు బలహీనంగా ఉంటాయి. కానీ, సుంకాల తగ్గింపుతోపాటు నైరుతి రుతుపవనాల్లో వర్షాలు కురవడం, పవిత్ర దినాలు, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగింది. సంఘటిత మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో స్టోర్ల ఏర్పాటుకు వివిధ జ్యువెల్లరీ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ పవిత్ర దినాలు ఎక్కువగా ఉండటం వల్ల బ్రాండెడ్ బంగారం ఆభరణాలకు గిరాకీ పెరుగుతున్నదని ఇక్రా తెలిపింది. జూలైలో దిగుమతి సుంకాలు తగ్గింపు, నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత స్వల్పకాలం బంగారం ధరల్లో సర్దుబాటు నెలకొంది. గత ఏడు త్రైమాసికాలుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గ్లోబల్ ఆర్థిక రంగాల్లో ఒడిదొడుకులు, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారంపై ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగిపోతున్నాయి.