న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఏప్రిల్ 2: రేపోమాపో తులం బంగారం ధర లక్ష రూపాయలను చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఆల్‌టైమ్ హైలో కదలాడుతున్న గోల్డ్ రేట్లను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు మరింత పరుగులు పెట్టించే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. ఇదే జరిగితే 24 క్యారెట్ 10 గ్రాములు లక్ష రూపాయలను దాటేసే రోజు ఎంతో దూరంలో లేదనే అంటున్నారంతా.
బుధవారం స్పాట్ మార్కెట్లో డిమాండ్ అంతగా లేకపోవడంతో ఫ్యూచర్ ట్రేడింగ్‌లో తులం విలువ రూ.154 తగ్గి రూ.90,721గా నమోదైంది. అయితే మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై జూన్ డెలివరీకి గోల్డ్ కాంట్రాక్ట్స్కుగాను ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.91,400 పలకడం గమనార్హం. అలాగే స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ తులం తొలిసారి రూ.94,150గా పలికిన సంగతి విదితమే. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 3,100 డాలర్లను అధిగమించింది.
ట్రంప్ టారిఫ్‌లు, ఆర్థిక మందగమనం భయాల నడుమ భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిడివైపు చూస్తున్నారు. దీనికితోడు హోల్‌సేల్, రిటైల్ జ్యుయెల్లర్స్ నుంచి డిమాండ్ కూడా ఉండటంతో మార్కెట్లో పుత్తడి ధరలు వేగంగా పెరుగుతూపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (జనవరి-మార్చి) 10 గ్రాముల పసిడి ధర దేశీయంగా రూ.15,200 పెరిగింది. దీంతో 1986 జూలై-సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలో 18.64 శాతానికిపైగా గోల్డ్ రిటర్న్స్ నమోదు కావడం ఇదే తొలిసారి అయినైట్టెంది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు గోల్డ్‌ను మించి సురక్షిత పెట్టుబడి సాధనం కనిపించట్లేదు.
ఈ ఏడాది మొదలు బంగారం ధరలు దేశ, విదేశీ మార్కెట్లలో కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. దీని వెనకున్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత వాతావరణం ఒకటి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఆందోళనలు కూడా గోల్డ్ రేట్లను ఎగదోస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి నిల్వలను పెంచడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంపై పెడుతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమే.
– కొలిన్ షా, కామా జ్యుయెల్లరీ ఎండీ
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడానికి డాలర్‌తో పోల్చితే పడిపోతున్న రూపాయి మారకం విలువ కూడా కారణమే. రూపీ మరింతగా పతనమైతే పసిడి విలువ కూడా అంతే స్థాయిలో విజృంభిస్తుంది. మొత్తానికి ఈ ఏడాది భారతీయ మార్కెట్లో తులం లక్ష రూపాయలను దాటడం ఖాయమే. అయితే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సంతరించుకుంటే, సెంట్రల్ బ్యాంక్‌ల ద్రవ్యవిధానం కఠినంగా ఉంటే, బంగారం ధరల పెరుగుదల కొంత మందగించవచ్చు.
– శ్రీరామ్ అయ్యర్, రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్