ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు ఈ పుత్తడే మీకు పరమాన్నంగా మారుతున్నది. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలైనప్పుడు ఈ గోల్డే మీకు ఆర్థికంగా ఆదుకుంటుంది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు బంగారమే శ్రీరామరక్ష. సామాన్యుడి నుంచి మొదలుకొని సంపన్నవర్గాలు కూడా ప్రతియేటా బంగారం ఎంతోకొంత కొనుగోలు చేస్తున్నారు. అక్కరకు వచ్చినప్పుడు ఈ గోల్డ్‌ను తాకట్టుపెట్టుకొని రుణాలు తీసుకుంటున్నారు. వీటికోసం బ్యాంకులతోపాటు ఆర్థిక సేవల సంస్థలు ప్రత్యేకంగా పసిడిపై రుణాలు మంజూరు చేస్తున్నాయి. సెక్యూర్డ్ రుణాలు కావడంతో బంగారం విలువలో 80 శాతం వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు. బంగారం కడ్డీలతోపాటు ఆభరణాలు తాకట్టుపెట్టుకొని కేవలం కొన్ని నిమిషాల్లోనే రుణం పొందవచ్చును. వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలు తీసుకోవాలంటే రోజుల సమయం పడుతుంది కానీ, బంగారంపై రుణాలు తీసుకోవడం ఎంతో సులభం. పెద్దగా డాక్యుమెంట్లు లేకుండానే తీసుకోవచ్చును. తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవచ్చును. ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు 8 శాతం మొదలు కొని 24 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంకులు తాకట్టుకింద పెట్టిన ఆభరణాలను జప్తు చేసుకొని వేలం వేసుకునే అధికారం ఉంటుంది. పసిడి విలువను గుర్తించడంలో ఒక్కో బ్యాంకుది ఒక్కో తీరుగా ఉంటుంది.
సిబిల్ స్కోర్ లేకుండానే బంగారంపై రుణాలు తీసుకోవచ్చును. కేవలం బంగారం లేదా ఆభరణాలు తాకట్టు పెట్టుకొని రుణాలు తీసుకోవచ్చును. దీనికోసం వారి క్రెడిట్ స్కోర్ ఎంత ఉన్నదో అవసరం లేదు. 500 లోపు సిబిలి స్కోర్ ఉన్నవారు కూడా సులువుగా రుణాలు తీసుకోవచ్చును.
బంగారం తాకట్టుపై రుణాలు తీసుకోవడానికి పలు డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిలో ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు, బ్యాంక్ ఖాతాతోపాటు కేవైసీ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. మనం తీసుకునే బ్యాంకులోనే ఖాతా ఉండాల్సి ఉంటుంది. ఇటీవలకాలంలో బ్యాంకులతోపాటు పసిడిపై రుణాలు ఎన్బీఎఫ్సీలు కూడా ఇస్తున్నాయి.
బంగారంపై తాకట్టుపై రుణాలు తీసుకున్నవారు మూడు రకాలుగా తిరిగి చెల్లింపులు జరుపుకునే అవకాశాలను బ్యాంకులు కల్పించాయి. వీటిలో నెలవారి చెల్లింపుల రూపంలో చెల్లింపులు జరుపుకోవచ్చును, లేదా మూడు నెలల్లో వడ్డీతో సహా తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చును. అలాగే ఆరు నెలలు, ఏడాది కాలపరిమితితో తీసుకున్న రుణాలను వడ్డీతో కలుపుకొని చెల్లించుకోవచ్చును. ఒకవేళ ఏడాది ముగిసిన తర్వాత తీసుకున్న రుణానికి వడ్డీని చెల్లించి మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు.