Gold Imports | పెండ్లిండ్ల సీజన్.. వరుస పండుగలతోపాటు దిగుమతి సుంకంలో భారీగా కోత విధించడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. గత నెలలో ఎకాఎకీన నాలుగు రెట్లు బంగారం దిగుమతి జరిగింది. 2023 నవంబర్లో 3.44 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే, ఈ ఏడాది 14.86 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అంటే 331 శాతం బంగారం దిగుమతి అయ్యిందన్న మాట.
ఇక గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో బంగారం దిగుమతులు 49 శాతం వృద్ధి చెందాయి. 2023-24 ఏప్రిల్ – నవంబర్ మధ్య 32.93 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 49 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. సగటున బంగారంపై పెట్టుబడులకు 25 శాతం వార్షిక రిటర్న్స్ లభించాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారమే స్వర్గధామంగా పరిగణిస్తున్నారు. గత జూలైలో కేంద్ర బడ్జెట్లో బంగారం దిగుమతిపై సుంకాలను 15 నుంచి ఆరు శాతానికి తగ్గించడం మరో కారణం. బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో భారత్ వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది.