Gold Imports | కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రికార్డుస్థాయి బంగారం దిగుమతులపై వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ స్పందిస్తూ.. బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు తెలిపారు. పండుగల సీజన్ నేపథ్యంలో నగల వ్యాపారులు అమ్మకాల కోసం బంగారాన్ని నిల్వలు చేయడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం డ్యూటీని 15 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఏప్రిల్-జూలై భారతదేశ బంగారం దిగుమతులు 4.23 శాతం తగ్గి 12.64 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ బంగారం దిగుమతులు 30శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశం దాదాపు 40శాతం స్విట్జర్లాండ్ నుంచి చాలా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి 16శాతం, దక్షిణాఫ్రికా నుంచి దాదాపు 10శాతం దిగుమతి అవుతుంది. మొత్తం దిగుమతుల్లో కేవలం ఐదుశాతం మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశం భారత్ నిలిచింది.