న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ భారతీయులు మాత్రం ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 71.98 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతైంది. అంతక్రితం ఏడాది దిగుమతైన 58 బిలియన్ డాలర్లతో పోలిస్తే 24 శాతం అధికం. అలాగే ఒకే ఏడాది ఇంతటి పసిడి దిగుమతి కావడం దేశీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే 2023-24లో 45.54 బిలియన్ డాలర్లు, 2022-23లో 35 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ దిగుమతి అయింది.
విలువ పరంగా చూస్తే మాత్రం 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు పడిపోయినప్పటికీ ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటం వల్లనే విలువ పుంజుకున్నదని పేర్కొంది. 2024-25లో 757.09 టన్నుల గోల్డ్ వచ్చి చేరింది. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 150 శాతం ఎగబాకి 12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పరిమాణం పరంగా చూస్తే 42 శాతం అధికమై 7,334.96 టన్నులకు చేరింది.
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర రూ.1,600 తగ్గి రూ.1.56 లక్షలకు దిగొచ్చింది. అలాగే కిలో వెండి రూ.5,700 తగ్గి రూ.2.53 లక్షలుగా నమోదైంది. దేశవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం, వివాహాలు లేకపోవడం కూడా కొనుగోలు నిలిచిపోయాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,786.90 డాలర్లకు దిగిరాగా, వెండి 79.28 డాలర్లకు చేరుకున్నది.